తెలంగాణలోనూ బాణాసంచా కాల్చటం, అమ్మకాలపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులు, కేసులు అధికంగా నమోదవుతున్న సందర్భంలో… టపాసులు అమ్మకం, కాల్చటం వల్ల జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉందన్న పిటిషన్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చటంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అందరూ సహకరించాలని, ప్రభుత్వం కూడా నిషేధంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే టపాసుల అమ్మకం, కాల్చటంపై రాజస్థాన్ హైకోర్టు నిషేధం విధించటాన్ని తెలంగాణ హైకోర్టు గుర్తు చేసింది.
దీపావళి సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈనెల 19న నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.