ఆర్టీసీ సమ్మెపై తమ పరిధి దాటి ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల్లో సమస్యను పరిష్కరించాలని లేబర్ కమీషనర్‌ను ఆదేశిస్తామని… ఇక ఈ అంశం లేబర్ కోర్టు చూసుకుంటుందని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె ముగించాలని కోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం పాత వాదననే కొనసాగించింది.
కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని, కార్మిక చట్టాల ప్రకారం కార్మికులు రూల్స్ పాటించలేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. నోటీసు ఇచ్చిన 6 వారాల తర్వాత సమ్మెకు వెళ్లాలని… కానీ కార్మికులు ఆ రూల్ పాటించలేదని అన్నట్లు తెలుస్తోంది.
అయితే, సమ్మె చట్ట విరుద్ధమని ఎవరు చెప్పారని ప్రశ్నించిన హైకోర్టు… లేబర్ కోర్టుకు ఆదేశాలిస్తామని వ్యాఖ్యానించింది. లేబర్ కోర్టులో కార్మికులకు అనుకూలంగా తీర్పురాకపోతే… ట్రిబ్యునల్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది.
హైకోర్టు తాజా నిర్ణయం ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే అంశంగా భావిస్తుండగా, ఆర్టీసీ కార్మికులు ఇక ఏం చేయనున్నారన్నది కీలకంగా మారింది.