తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్సలపై దాఖలైన 24ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. గతంతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని అభిప్రాయపడిన కోర్టు, రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్ పరిస్థితులపై ఆరా తీసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయని… వారికి చికిత్స అందించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వ్యాక్సినేషన్ పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం, కరోనా పరీక్షలపై పూర్తి నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 25 నుండి ఫిబ్రవరి 1 వరకు కరోనా పరీక్షలతో పాటు పూర్తి సమాచారాన్ని ఫిబ్రవరి 19లోపు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
గత జూన్ నుండి సీరం సంస్థ చేసిన ట్రయల్స్ పై వివరాలు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. కరోనా పై దాఖలైన మూడు వ్యాజ్యాలు మినహా మిగిలిన వాటిపై విచారణను ముగించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స వసతులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అంశాలపై విచారణ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది.