ఓ ఇల్లు కూల్చివేత వ్యవహారంలో సీఎస్ కు సంబంధం ఏమిటి? కూల్చివేతకు మీరు ఆదేశాలు ఎలా ఇస్తారు? అంటూ తెలంగాణ హైకోర్టు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ని నిలదీసింది. తన ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆదేశాలను.. సవాల్ చేస్తూ కాంతామణి నాగార్జున అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై జస్టిస్ కే లలిత బుధవారం విచారణ జరిపారు. ఈ విషయం పై పిటిషనర్ తరఫు లాయర్ ఆర్ పవన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాది ఆస్తికి, పిటిషనర్ ఆస్తికి సంబంధమే లేదని, సర్వే నంబర్లు కూడా వేరని కోర్టుకు తెలిపారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు ఏ ప్రాతిపదికన ఉత్తర్వులిచ్చారో చెప్పాలని ఆయన కోరారు.
దీంతో విచారణకు హాజరైన మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి కూల్చివేతకు మీరు ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కింది స్థాయిలో అధికారులు ఉండగా సీఎస్ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలపాలని హైకోర్టు కోరింది.
జీహెచ్‌ఎంసీ చట్టంలో అనేక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. ఇందు కోసం పది రోజులు గడువు ఇచ్చింది. ఇల్లు కూల్చివేతకు సంబంధించి దాఖలైన కేసు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు.