తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ఎన్నిసార్లు కోర్టు ద్వారా చివాట్లు తిన్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లిపోతోంది. కేసీఆర్‌కు కోర్టులు అడ్డు తగులుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది శాసనసభ్యులకు సరిపోయిన అసెంబ్లీ భవనం తెలంగాణలో 120 మందికి ఎందుకు సరిపోదు? అసెంబ్లీలో చాలా వరకు తెలంగాణ వచ్చాక మరమ్మతులు చేశారు. మరమ్మతుల కోసం కోట్లు ఖర్చుపెట్టారు. కారణం లేకుండా అసెంబ్లీని ఎర్రమంజిల్‌కు మారుస్తాం.. అక్కడ కొత్త భవనం నిర్మిస్తాం.. అని ప్రకటించారు. ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా ముఖ్యమంత్రి అవేవి పట్టించుకోకుండా శంకుస్థాపన కూడా చేశారు. ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో కొత్త అసెంబ్లీని నిర్మించడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఇప్పుడున్న అసెంబ్లీలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్ సదుపాయం ఉంది. మండలికి ప్రత్యేక భవనం ఉంది. పైగా సచివాలయానికి దగ్గరగా ఉంది. ఎర్రమంజిల్ పార్కింగ్ చాలా ఇబ్బంది. సమావేశాలు జరిగే సమయంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోని సీఎం తన హయంలో కొత్త భవనం నిర్మించాలని మాత్రమే ఆలోచన చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. అని కోర్టు మెట్లెక్కారు.
కేబినెట్ నిర్ణయాన్ని కూడా కోర్టు కొట్టివేయడం కచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టే అపి అనుకోవాలి. కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలని పరిశీలకులు చూస్తున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్తుందా లేక ఎలాగో ఆర్థిక మాంద్యం ఉంది కదా.. ఈ సమయంలో ఇవన్నీ ఎందుకు అని వెనక్కి తగ్గుతుందా చూడాలి. అమరావతి పెద్ద డెడ్ ఇన్వెస్టుమెంట్ అంటూ చంద్రబాబును కామెంట్ చేసిన వ్యక్తికి కొత్తగా ఇక్కడ మరో అసెంబ్లీ భవంతిని నిర్మించుకోవడం వేస్ట్ అని తెలియదా..? ఉస్మానియా, లేదా గాంధీ ఆసుపత్రి మినహా నగరంలో సరైన ఆసుపత్రి లేక జ్వరాలు వచ్చినప్పుడు జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవంతి కట్టాలని తహతహలాడే కేసీఆర్ ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మిస్తే అది అందరికీ ఉపయోగంగా వుంటుంది కదా…? కావాలంటే ఆ ఆసుపత్రికి కేసీఆర్ పేరు పెడదాం.. ఏమంటారు ?