టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై బీజేపీ నేతలు తల పెట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహాధర్నా చేపట్టేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. దీంతో మహాధర్నాకు ఏర్పాట్లు చేసే పనిలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.
మొదట ఈ ధర్నాకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. దీంతో బీజేపీ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని షరతులతో అనుమతులు ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొన రాదని హైకోర్టు కండీషన్ పెట్టింది.
ధర్నా సమయంలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ధర్నాకు హాజరయ్యే నేతల వివరాలను పోలీసులకు ఈ రోజు రాత్రి 9 గంటల్లోగా ఇవ్వాలని సూచించింది. ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ సహేతుకంగా లేదని తెలిపింది.
నిరసన తెలపడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. మహాధర్నాకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ధర్నాచౌక్ వద్ద అనుమతివ్వకపోతే జనం ధర్నాలు ఎక్కడ చేయాలని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.
మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై సిట్ నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సిట్‌కు ఆయన లేఖ రాశారు. నోటీసులోని విషయాలు తాను చూడలేదనే అంశాన్ని నిస్సందేహంగా తెలియజేస్తున్నట్టు చెప్పారు.
పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున వాటికి హాజరవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నేడు తాను సిట్ ఎదుట హాజరుకావాల్సి వున్న విషయం వార్తా పత్రిలక ద్వారా తెలిసిందన్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా తాను ఈరోజు రాలేనని ఆయన వెల్లడించారు.