దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 5,233 కేసులు వెలుగుచూశాయి. మంగళవారం(3,714)తో పోల్చుకుంటే కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. దాదాపు 41 శాతం అధికంగా ఉంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కు చేరింది.
ఇప్పటివరకు 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. 5,24,715 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,857గా ఉంది. గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1,881 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే ఉన్నాయి.
ఇటు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.
Advertisements
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. కోవిడ్ జాగ్రత్తలు అందరూ పాటించేలా చూడాలని తెలిపింది. తర్వాతి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.