రాష్ట్ర ప్రభుత్వం సేకరించే అసైన్డ్ భూమికి పరిహారం చెల్లింపులో వివక్ష చూపవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు పట్టా భూముల యజమానులతో సమానంగా ప్రభుత్వ అసైన్డ్ భూములు కలిగి ఉన్న అసైనీలకు సైతం పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
‘‘భూ సేకరణ అధికారి వర్సెస్ మేకల పాండు, ఇతరులు’’ కేసులో ప్రభుత్వ భూమి అసైనీలకు భూమి పూర్తి మార్కెట్ విలువకు సమానమైన పరిహారం, పట్టా యజమానులతో సమానంగా ఇతర ప్రయోజనాలను చెల్లించడానికి అర్హులని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం పునరుద్ఘాటించింది. అసైన్డ్ ల్యాండ్ హోల్డింగ్‌లను గ్రాంట్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసమే సదరు భూమిని సేకరిస్తున్నప్పటికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పింది.
అసలేం జరిగిందంటే.. 1998లో నల్గొండలోని పానగల్‌లోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కోసం ఇతర ప్రైవేటు పట్టాదారులతో, అసైనీల నుంచి భూమిని ప్రభుత్వం తీసుకుంది. 1998లో అసైన్డ్ భూములు కలిగినవారికి(అసైనీలు), పట్టాదార్లకు ఎకరాకు రూ. 31,500 చొప్పున పరిహారం అందించారు. అయితే ఆ తర్వాత పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించడంతో.. 2008లో పరిహారం రూ. 1,10,000గా నిర్ణయించింది. దీంతో పెంచిన మొత్తాన్ని 2011లో పట్టా భూ యజమానులకు మాత్రమే జమ చేశారు. అసైనీలు కోర్టులో పిటిషన్ వేయలేదని.. వారికి పెంచిన మొత్తాలను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించింది.
ఈ నేపథ్యంలో పట్టాదారులతో సమానంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని అసైనీలు అధికారులకు విజ్ఞాపనలు అందజేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అసైనీలు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ అనంతరం.. 2022 మార్చిలో సింగిల్ జడ్జి పట్టాదారులతో చెల్లించిన దానితో సమానంగా పిటిషనర్లకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీలు చేసింది. అయితే తాజాగా సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసింది.