తెలంగాణలో డెంగ్యూ చావులపైనా ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందా? ఔను! తెలంగాణలో డెంగ్యూ వ్యాధి ఉన్నా, ఆ వ్యాధితో మరణాలు సంభవించినా బయటకు చెప్పొద్దని ప్రైవేట్ ఆస్పత్రులపై ఆంక్షలు విధించటాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ విధానాలు సరికావని తెగేసి చెబుతూ.. పత్రికల్లో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
పత్రికల్లో వచ్చేవన్నీ అసత్యాలు అంటూ అడ్వకేట్ జనరల్ చెప్పపోగా, పూర్తి నిజాలు కాకున్నా, అర్ధ సత్యాలైనా ఉంటాయి. అయినా వాటిని దాచి ఏం ప్రయోజనం అంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ద్విసభ్య బెంచ్ చివాట్లు పెట్టింది. డెంగ్యూ నివారణకు రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఈనెల 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
దీనిపై అమిస్ క్యూరి నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, డెంగ్యూ వ్యాధి నివారణకు కేంద్ర ప్రత్యేక ప్రణాళిక, వ్యాధి గుర్తిస్తే నివారణకు ర్యాపిడ్ యాక్షన్ టీములు ఏర్పాటు చేసిందని తెలిపారు. కేంద్ర విధానాలు అమలయ్యేలా చూడాలని అడ్వకేట్ జనరల్‌ను న్యాయమూర్తులు ఆదేశించారు.
డెంగ్యూ సోకిన విషయం బయటపెట్టొద్దంటూ ప్రైవేట్ ఆస్పత్రులపై సర్కార్ ఒత్తిడి తెస్తుందని హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు ఓ రౌండ్ టేబుల్ మీట్ కూడా ఏర్పాటు చేసుకోగా, ఇదే అంశంపై ప్రభుత్వం నిస్సహాయంగా ఉంటోందని డాక్టర్ కరుణ పిల్ దాఖలు చేశారు.