కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు కొట్టిన దొబ్బలతో శాంతాపూర్ గ్రామానికి చెందిన భూం బోయి మరణించాడని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండుగ రోజు శాంతాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం దగ్గర పేకాట ఆడుతున్నారని బిచ్కుంద పోలీసులకు సమాచారం అందింది. 8 మంది పోలీసులు దేవాలయం రెండు వైపులా చుట్టుముట్టారు. పోలీసులను చూసిన పేకాటరాయుళ్లు తలా ఓ దిక్కు పారిపోయారు. కానీ.. వడ్లు ఆరబోసుకొని వాటి కాపలాగా ఉన్న రైతులు పారిపోలేదు. వారు కూడా పేకాట ఆడేవాళ్లు అనుకుని విచక్షణను కోల్పోయి రెండు చేతులు వెనక్కి పెట్టించి బలంగా చెంపలపై కొట్టారు. అక్కడే వడ్ల కుప్పలపై ఉన్న కర్రలతో చావబాదారు. ఈ క్రమంలోనే భూం బోయి తల వెనుక భాగంలో గాయమైంది.
బాధితున్ని కుటుంబ సభ్యులు బాన్సువాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ నవంబర్ 11న చనిపోయాడు రైతు. పోలీసులు తన భర్తను చంపారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది మృతుడి భార్య లచ్చవ్వ. న్యాయం చేస్తారని భావించిన ఉన్నతాధికారులు ఆమెను భయపెట్టి కంప్లైంట్ తీసుకోకుండా వెళ్ళగొట్టారు. గాంధీ ఆసుపత్రిలో చనిపోయిన భూంబోయి మృతదేహాన్ని ఇవ్వకుండా.. తాము చెప్పిన విధంగా ఉన్న పత్రంపై సంతకం చేస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. గత్యంతరం లేక లచ్చవ్వ సంతకం చేసి శవాన్ని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసింది.
పోలీసుల దెబ్బలకు భూం బోయి చనిపోయింది వాస్తవమా..? అని తెలుసుకొనేందుకు పౌర హక్కుల ప్రజా సంఘం తెలంగాణ రాష్ట్రం(PUCL-TS), సోషలిస్ట్ పార్టీ (ఇండియా), తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులతో కలిసి నిజ నిర్దారణ కమిటీగా ఏర్పడి నవంబర్ 27న ఘటన జరిగిన గ్రామంలోనూ, స్థానిక పోలీస్ స్టేషన్లోనూ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశాయి. ఈ పరిస్థితులను వివరిస్తూ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) హై కోర్టు ధర్మాసనం దృష్టికి PUCL-TS ఆధ్వర్యంలో తీసుకెళ్ళింది. తాజాగా వాదనలు విన్న జస్టిస్ బీ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. మెడికల్ రిపోర్టు, పోస్ట్ మార్టం నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు అందించాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ఆదేశించింది. బిచ్కుంద పోలీసులను క్రైమ్ నెంబర్ 179/2021 కు చెందిన GD ఎంట్రీతో సహా కోర్టుకు అందచేయాలని ఆదేశిస్తూ.. ఈ నెల 22కు కేసును వాయిదా వేసింది.