మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసింది. మమత మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో దాఖలైన కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆయన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కాలేజీ ఛైర్మన్ హోదాలో ఉన్నందున ఆయనకు నోటీసులు ఇచ్చింది.
పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులపై గతేడాది పిటిషన్ దాఖలైంది. దీంతో పీజీ వైద్య కోర్సులకు 2016 జీవో ప్రకారం పాత ఫీజులను తీసుకోవాలని వైద్య కళాశాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులను మమతా మెడికల్ కళాశాల వసూలు చేసింది.
దీంతో కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు తిరిగి ఇచ్చివేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కానీ, తమకు ఇవ్వాల్సిన ఫీజును తిరిగి ఇవ్వడం లేదంటూ కొందరు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో వివరణ ఇవ్వాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.