తెలంగాణ హైకోర్టు లో అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్ ముందు వర్చ్యువల్ హియరింగ్ ద్వారా విచారణ చేపట్టారు. అగ్రిగోల్డ్ బ్యాంకులకు కుదువ పెట్టిన ఆస్తులను తాము ప్రైవేటు ఒప్పందాల ద్వారా విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం కోరింది.
బ్యాంక్ అప్పులకు వన్ టైమ్ సెటిల్మెంట్ -ఓటిఎస్ సదుపాయం కల్పించాలని కోరిన అగ్రిగోల్డ్ యాజమాన్యం, ఫ్రాడ్ కేసులో వన్ టైమ్ సెటిల్మెంట్ అడగడమేమిటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రైవేటు అగ్రిమెంట్ల ద్వారా అమ్మకం జరిపేందుకు అనుమతి ఇవ్వాలన్న అగ్రిగోల్డ్ అభ్యర్థనపై కూడా హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇలాంటి దరఖాస్తులు ఆమోదయోగ్యం కాదని జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు స్పష్టం చేశారు.
బ్యాంకుల ద్వారా వేలం వేసినప్పుడు వాటిలో ఎక్కువ డబ్బు కు కొనేవాళ్లను మీరు తీసుకొనే రావచ్చు కదా అని అగ్రిగోల్డ్ తరుఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచంద్రను హైకోర్టు ప్రశ్నించింది. ఏ ప్రాపర్టీ తక్కువ ధరకు బ్యాంకులు వేలంలో అమ్మారు, వాటిని అధిక ధరకు కొనేందుకు ఎవరైనా సిద్దంగా ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.
గతంలో అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ టేకోవర్ చేసే ప్రతిపాదన వచ్చినప్పుడు బ్యాంకుల ద్వారా వేలం వొద్దని తాము కోరామని, వారం రోజులు సమయం ఇస్తే పూర్తి వివరాలు కోర్టుకు నివేదిస్తామని అగ్రిగోల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్. రవిచంద్ర కోర్టుకు నివేదించారు. కాగా ఆంధ్రా బ్యాంకు ద్వారా వేలం వేసిన రెండు ఆస్తులు, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ద్వారా వేలం వేసిన మిడ్జల్ ఆస్తుల వేలాన్ని ఫైనల్ చేయాలని బిడ్డర్ల తరఫు న్యాయవాదులు కోరారు.
అగ్రిగోల్డ్ దరఖాస్తుల తోపాటు, ఇతర బిడ్డర్ల దరఖాస్తులను డిసెంబర్ 8 న విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించిన తర్వాత వారికి చెల్లింపులు ఉంటాయి తప్ప హైకోర్టు లో ఇంప్లీడ్ మెంట్ అప్లికేషన్ వేసినంత మాత్రాన వారికి డబ్బులు రావని ఒక సంక్షేమ సంఘం తరుఫున న్యాయవాది కి హైకోర్టు స్పష్టం చేసింది.