అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకుండానే ఆన్‌లైన్ క్లాస్‌లను ఎలా కొనసాగిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌లైన్ క్లాసులు నిషేధించాలన్న పిల్‌పై విచారణ సందర్భంగా స్పష్టత ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బుధవారం కేబినెట్ సమావేశం జరిగిందని.. డిస్టెన్స్, ఆన్‌లైన్ పద్ధతిలోనే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు పేరెంట్స్ నుంచి విడివిడిగా పిటిషన్లు స్వీకరించలేమని.. అలా చేస్తే వరద గేట్లు తెరిచినట్టవుతుందని, భారీ సంఖ్యలో పిటిషన్లు వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు చంద్రశేఖర్ అనే ఓ పేరెంట్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు దృష్టికి తీసుకురాదల్చిన విషయం ఏదైనా ఉంటే పిటిషనర్.. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా తెలపాలని సూచించింది. మరోవైపు ఈ విషయంపై సీబీఎస్ఈ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఆగస్టు 27కి వాయిదా వేసింది హైకోర్టు.