ఓవైపు థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. ఇప్పటికే కరోనాతో ఎంతో మంది మరణించారని… నష్ట నివారణకు మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని కోర్టు ప్రశ్నించింది.
మీరు వేసే ప్రణాళికలు, ప్రక్రియ కోసం వైరస్ వేచి చూడదు అంటూ వ్యాఖ్యానించిన కోర్టు… ఇంకా నిపుణుల కమిటీ భేటీలు కాకపోవటంపై విస్మయం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించింది. వారం రోజుల్లో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే ప్రణాళికలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని కోర్టు మరోసారి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు వైద్యారోగ్య శాఖ అధికారులు, నోడల్ ఆఫీసర్లు హజరు కావాలని కోర్టు ఆదేశించింది.