సినీ దర్శకుడు ఎన్. శంకర్ కు ప్రభుత్వం శంకర్ పల్లిలోని మోకిల్లాలో ఎకరం కేవలం 5లక్షలకు కేటాయించటంపై హైకోర్టు మరోసారి విచారించింది. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం ఇలా ప్రభుత్వ భూములను కారు చౌకగా కేటాయించిందని ప్రశ్నిస్తూ జగిత్యాలకు చెందిన శంకర్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు.
విచారణలో భాగంగా ఆ 5 ఎకరాల స్థలంలో 50కోట్లతో స్టూడియో నిర్మించి, 300మంది ఉపాధి కల్పించబోతున్నట్లు దర్శకుడు ఎన్. శంకర్ కోర్టుకు తెలిపారు. అక్కడ స్థలం ఎంత రేటు ఉందని కోర్టు ప్రశ్నించగా… మార్కెట్ రేటు ప్రకారం ఎకరం 2.5కోట్ల వరకు పలుకుతుందని హెచ్ఎండీఏ కోర్టుకు తెలిపింది. మరి అంత రేటున్న భూమిని కేవలం ఎకరం 5లక్షలకు ఎలా కేటాయిస్తారు, క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలకు కూడా ప్రాతిపాదిక ఉండాలి కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని చెప్పగా…. తమకు కొంత సమయం కావాలని, ఏజీ క్వారెంటైన్ లో ఉన్నందున గడువు ఇవ్వండని ప్రభుత్వం కోరటంతో కోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.