హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ 80లోని భూములపై తెలంగాణ హైకోర్టు స్పష్టతనిచ్చింది. రూ. వేల కోట్లు విలువ చేసే ఆ 140 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానివి కాదని తేల్చింది. ఆ భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెందినవేనని తీర్పు వెలువరించింది.
సర్వే నెంబర్ 80లోని ఆ భూములు తమవేనంటూ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రవీణ్‌రావు, మరికొందరు హైకోర్టుకు వెళ్లారు. సుదీర్ఘ విచారణ తర్వాత.. ఆ భూములు ప్రభుత్వానివిగానీ, లేదా వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన భూములు కానేకవని తెలిపింది. ఆ 80 ఎకరాల్లో 50 ఎకరాలను ప్రవీణ్‌రావు, ఆయా యజమానుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే పిటిషనర్లకు రూ.4లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇదిలా ఉంటే తాజా తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది.
హఫీజ్‌పేట భూముల వివాదం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రవీణ్‌రావుతో పాటు మరికొంతమందిని కిడ్నాప్ చేశారంటూ ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌పై కేసులు నమోదైంది, వారు అరెస్టయింది ఈ భూముల వ్యవహారంలోనే. కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ బెయిల్‌పై విడుదలయ్యారు