మైనర్ బాలికతో.. ఆమె ఇష్టంతోనే అయినప్పటికీ శృంగారంలో పాల్గొనడం అత్యాచారమే అవుతుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా.. ఓ మైనర్ బాలికకు సంబంధించిన కేసులో కోర్ట్ సంచలన తీర్పు ను ప్రకటించింది. అయితే.. ఓ 15 ఏళ్ల బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లిన బంధువు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ కేసులో బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిచ్చిన కోర్టు.. బాలిక ఇష్టపూర్వకంగానే బంధువుతో వెళ్లినప్పటికీ.. లైంగికంగా కలిసినా తను మైనర్ కావడంతో అది అత్యాచారం పరిధిలోకే వస్తుందని కోర్టు పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న వివాహితుడైన బంధువు (26) వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో బాలిక ఇంటికి వచ్చిన అతడు ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఆమెను బయటకు తీసుకువెళ్లి.. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.
దీంతో భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నిందితుడు ఖమ్మం వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరోవైపు.. బాలిక గర్భం దాల్చడంతో దానిని తొలగించేందుకు నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు బాలిక కుటుంబ సభ్యులు. అయితే.. బాలిక అప్పటికే 20 వారాల గర్భిణి కావడంతో తొలగించడం ఆమె ఆరోగ్యానికి ప్రమాదకరమని.. గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించారు డాక్టర్లు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా.. గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిచ్చింది కోర్టు.