ఓవైపు జనం పిట్టల్లా రాలిపోతున్నా… ఆసుపత్రులకు క్యూ కడుతున్నా… అలాంటిదేమీ లేదంటూ చెప్తూ వస్తోన్న సర్కార్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు ఎక్కువగా ఉన్నాయని… ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి ఆ మధ్య ప్రతి జిల్లా తిరిగి డెంగ్యూ మరణాలేవీ సంభవించటం లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతే తప్పా… ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు మాత్రం చేపట్టలేదు.
వరుసగా డెంగ్యూ మరణాలు సంభవిస్తుండటంతో… ఆమధ్య ప్రైవేటు డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మరీ, డెంగ్యూ మరణాలను బయటపెట్టొద్దు అంటూ ఒత్తిడి తెచ్చింది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రులు స్వయంగా బయటపెట్టాయి. దీనిపై కోర్టు కూడా సీరీయస్ అయింది. అయినా ప్రభుత్వ తీరులో కొంచెం అయిన మార్పు వచ్చినట్లు కనపడటం లేదు. తాజాగా ఓ జడ్జి కూడా డెంగ్యూ కారణంగా మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్య జనం ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేక, అలాగని ప్రాణాలు పొగొట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై పవన్‌కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు.
దీనిపై విచారిస్తూ.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమయ్యారని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, మెడికల్ డైరెక్టర్ స్వయంగా హజరై వివరణ ఇవ్వాలని రేపటి వరకు గడువిచ్చింది.