పని నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు అక్కడ అనుకోని అతిథిని చూసి షాక్ అయ్యాడు. పొలం దిగిన అతనికి అక్కడ మొసలి కనిపించడంతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ సమాచారాన్ని గ్రామస్తులకు చేర వేశాడు. వారుకాస్త ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు అంద జేశారు.
జిల్లా స్నేక్ సొసైటీ నిర్వాహకుల వచ్చి మొసలిని రెస్క్యూ చేశారు. వెంటనే దాన్ని సమీపంలోని ప్రాజెక్ట్ నీటిలో వదిలి పెట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులో చోటు చేసుకుంది. బాల్ రెడ్డి పొలంలో మొసలి వుందన్న విషయం గ్రామం మొత్తం పాకింది.
దీంతో మొసలిని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. దీంతో అక్కడ హడావిడి వాతావరణం నెలకొంది. జిల్లా స్నేక్ సొసైటీ నిర్వాహకులు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో పొలంలోని మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం దాన్ని వాహనంలోకి ఎక్కించారు.
అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి సూచన మేరకు ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ ప్రాజెక్టు నీటిలో దాన్ని వదిలి వేశారు. ఆ మొసలి 12 అడుగుల పొడవు ఉండగా దాదాపు 270 కేజీల బరువు ఉందని తెలిసింది.