పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. దాడులపై పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు చేసింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులకు పీఎఫ్ఐ కుట్రలు పన్నుతోందని హెచ్చరించింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించింది. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందు ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు.
దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా,యువతను ఉగ్ర సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోందని ఇటీవల పీఎఫ్ఐ సంస్థపై కేంద్రం ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ సంస్థను చట్ట విరుద్దమైన సంస్థగా ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంఘాల కార్యకలాపాలపై కేంద్రం ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు పీఎఫ్ఐకి చెందిన పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను కూడా కేంద్రం నిలిపివేసింది.