రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాటు చేశారు. 1,443 కేంద్రాల్లో 9లక్షల 7వేల 393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్ లో ఇంప్రూవ్ మెంట్ రాసుకొనే అవకాశం కల్పించారు. దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది ఈ ఒక్క ఏడాదికి మాత్రమే.
శుక్రవారం నుంచి మే 24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి పంపుతామని అధికారులు ప్రకటించారు. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వడంతో పాటు ప్రశ్నలకు ఇచ్చే ఛాయిస్ లను పెంచింది ఇంటర్ బోర్డు.
సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. పరీక్షలు పూర్తయిన నెలలోపే ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అవి వచ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల భయం, టెన్షన్ ను దూరం చేసేందుకు 1800 5999 333 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.