ఒకప్పుడు కరువు నేలగా వున్న తెలంగాణ ఇప్పుడు భారత ధాన్యాగారంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధికి తెలంగాణ కూడా తన వంతుగా తోడ్పడుతోందని, అలాంటి రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం గుర్తించాల్సి వుందని ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ మరోసారి కోరారు.
రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని గతంలో పలు మార్లు కోరామన్నారు. ఇక దేశంలో అత్యధికంగా జాతీయ గుర్తింపు పొందిన ప్రాజెక్టులు ఉత్తర భారత్ లో వున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోని పోలవరానికి కేంద్రం జాతీయ హోదాను ఇచ్చింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి వుంటుందని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చే అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తుంటారని చెబుతున్నారు.
పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చేందుకు వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తుంటారు. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులకు ఈ హోదా కల్పిస్తారు. విస్తరణ, పునర్నిర్మాణం, ఆధునికీకరణ ద్వారా ప్రాజెక్టులు కనీసం 2 లక్షల హెక్టార్లకు నీరు అందించే స్థాయికి చేరితే అప్పుడు కూడా జాతీయ హోదా ఇవ్వవచ్చు.