దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో మెరుగ్గు పనిచేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అయితే వరి ఆరబెట్టే ఫ్లాట్ ఫారమ్ ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని, అదే గుజరాత్ లో మాత్రం 192 కోట్లతో చేపల కోసం అనుమతించిందని కేటీఆర్ కేంద్రం తీరుపై మండిపడ్డారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చాలని ప్రతిపక్ష పార్టీలకు కేటీఆర్ సవాల్ విసిరారు. ఇప్పటి వరకు బిల్లులు క్లియర్ చేయలేదని రాజకీయ మైలేజ్ కోసం బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఇక తెలంగాణలో అవినీతి తక్కువగా ఉందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవెలపింగ్ సొసైటీ సర్వేలో తేలిందన్నారు ఆయన. ఇన్ని సాధించిన తెలంగాణపై ఆర్థిక ఆంక్షలను మోడీ సర్కార్ విధిస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి 30,000 కోట్ల రుణం తీసుకునే సామర్థ్యం కావాలంటే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు సహా కేంద్రం చెబుతున్న విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం పట్టుబట్టిందని ఆయన అన్నారు.
కార్పొరేష్ల ద్వారా పొందిన రుణాలను కూడా ఎఫ్ ఆర్బిఎం చట్టం కింద చేర్చి, రాష్ట్రానికి 20,000 కోట్ల కోత విధించిందన్నారు. వ్యాపార నిర్వహణ చట్టం కింద రుణాలపై కేంద్రం కూడా ఆంక్షలు విధిస్తూనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రీన్ కవర్ లో 7.7 శాతం వృద్ధితో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రత్యేకంగా ఉందన్నారు.