పరిశోధనల్లో నిమగ్నమై పరిశోధకులు, విద్యార్ధులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. గురువారం ఆమె సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధకులు రూపొందించిన వైద్య పరికరాలను ఆవిష్కరించి మాట్లాడారు.
ఐఐటి హైదరాబాద్‌లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. కరోనా సమయంలో వెంటిలేటర్ కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మహమ్మారి సమయంలో భారతీయులు ఎన్నో ఆవిష్కరణలు చేశారని చెప్పారు. దేశం నుంచి గొప్ప గొప్ప ఆవిష్కరణలు రావడం గర్వంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగానికి క్యాపిటల్‌గా ఉందన్నారు. తెలంగాణ నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్, మందులు ఎగుమతులు జరిగాయి తెలిపారు.
అలాగే, పరిశోధనల్లో నిమగ్నమై పరిశోధకులు, విద్యార్థులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. మన జీవనశైలిలో రోజూ యోగాతో పాటు వ్యాయామాలు కూడా చేయాలని తమిళిసై తెలిపారు. కరోనాతో రెండేళ్లుగా ఇబ్బందులు పడ్డామని, మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు విశేషంగా సేవలందించారని ఆమె కొనియాడారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రపంచం కరోనాతో సతమతమవుతుంటే మనం వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అందుకు కారణం వైద్యరంగంలో వస్తున్న ఆవిష్కరణలే కారణమని అన్నారు. మనం ఇంకా కరోనా నుంచి బయట పడలేదని గవర్నర్ గుర్తు చేశారు. విద్యార్థులంతా పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు.