– ఒక్కరి బాధను ఊరి బాధగా మార్చిన వైనం
– జై తెలంగాణ పేరుతో రాజకీయం
– ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎందుకిలా?
– ఇంకా ఎన్నాళ్లు..?
– తెలంగాణ జర్నలిస్టులకు..
– సమస్య వస్తే ఎక్కడకి పోతారు?
క్రైం బ్యూరో, తొలివెలుగు:ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఎన్నికల రచ్చ మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కౌంటింగ్ దగ్గర వినిపించిన జై తెలంగాణ నినాదాల నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకు చూస్తే.. తెలంగాణ జర్నలిస్టులను ఎలా వాడుకుంటున్నారో అర్థం అవుతోంది. ఒక్క యూనియన్ బాధనో.. ఒక్కరి బాధనో తెలంగాణ అందరి జర్నలిస్టుల సమస్యగా చూపించేందుకు చూస్తున్నారని అంటున్నారు. పైగా సోషల్ మీడియాలో ఆంధ్రా పెత్తనం అంటూ పదేపదే జై తెలంగాణ నినాదాలు చేస్తుండడం చూసి ఇంకా ఎన్నాళ్లు ఇలా మాయ చేస్తారని కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు తెలంగాణ జర్నలిస్టులు.
1. ఇప్పటిదాకా తెలంగాణ జర్నలిస్టులకు క్లబ్ లో కొత్తగా ఎన్ని సభ్యత్వాలు ఇచ్చారు? ఎనిమిదేళ్ల నుంచి అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, అధికార పార్టీ న్యూస్ ఛానల్ ప్రధాన రిపోర్టర్లు కోశాధికారిగా అందరూ తెలంగాణ వారే చేశారు. అప్పుడు ఎంతమందికి సభ్యత్వాలు అందాయి. ఇప్పుడెందుకు ఒక్కరి కోసం ఆంధ్రా ఓట్లు అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు?
2. హైదరాబాద్ లో పనిచేసే వారికే ఓటు హక్కు ఉండాలన్న విషయంలో ఆంధ్రాలోని ఓ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లను ఎందుకు తీసివేయలేకపోయారు. కొంత మందికే ఓటు హక్కు రద్దు చేశారు? ఇప్పుడు ఓ కమిటీ ఆంధ్రాలో పనిచేసే వారు తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు వేసినందుకు శాశ్వతంగా రద్దు చేసే దమ్ము తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని అంటున్న వారికి ఉందా..?
3. తెలంగాణ వాదాన్ని అవసరానికి వాడుకునే పదంలా చేసింది ఎవరో గుర్తుందా? పదవులు రాకపోతే.. పొడిగించకపోతే.. వ్యక్తిగతంగా ఇబ్బంది అయితేనే తెలంగాణ వాదాన్ని వాడుకుంటారా? అసలు.. తెలంగాణ జర్నలిస్టులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే ఎప్పుడైనా పట్టించుకున్నారా? జర్నలిస్టుల గుండెకాయ సచివాలయంలోకి రాకుండా బయటకు గెంటేసి అవమానించినప్పుడు తెలంగాణ నినాదం గుర్తుకు రాలేదా?
4. ప్రెస్ క్లబ్ లో ఆంధ్రా పెత్తనం అంటూ పోస్టులు పెట్టారే.. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్స్ కి దొచిపెట్టినప్పుడు.. ఆంధ్రా పెట్టుబడిదారులకు అక్రమంగా భూములు క్లియర్ చేస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ గా తెలంగాణ సంపద గుర్తుకు రాలేదా..? అంతెందుకు టీఆర్ఎస్ ఛానల్స్ లో, పత్రికల్లో తెలంగాణ వారి ఉద్యోగాలు తీసివేసి ఆంధ్రా పెత్తందారులకు అంటగట్టినప్పుడు వినిపించని జై తెలంగాణ నినాదాన్ని ఇప్పుడెందుకుందు వాడుకుంటున్నారు అధ్యక్షా..?