– బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్..
– ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్న అసంతృప్తులు
– ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయంగా బీజేపీ!
– రాహుల్ టూర్ తర్వాత మారిన రాజకీయం
– హస్తం నేతల్లో ఐక్యత.. క్యాడర్ లో జోష్
– కాంగ్రెస్ బలోపేతంతో నేతల్లో కన్ఫ్యూజన్
హ్యాట్రిక్ కొడతామంటోంది టీఆర్‌ఎస్.. కాషాయ జెండా ఎగురవేస్తామంటోంది బీజేపీ.. పూర్వవైభవం వస్తుందని భావిస్తోంది కాంగ్రెస్.. మూడు పార్టీల టార్గెట్ అధికారమే. చాలా దూకుడుగా రాజకీయాలు సాగిస్తున్నాయి. మాటల యుద్ధాన్ని ఓ రేంజ్ లో కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంటే.. లేదు లేదు టీఆర్‌ఎస్, కాంగ్రెసే ఒకటని చెబుతోంది బీజేపీ. ఎవరితో ఎవరికి డీలింగ్స్ ఉన్నాయో అంతా సస్పెన్స్. అయితే.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు రాజకీయ పండితులు.
టీఆర్‌ఎస్ లో ఎంతోమంది అసంతృప్త నేతలు ఉన్నారు. ఎప్పుడు జంప్ అవుదామా అని చాలామంది చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో నాయకత్వం విషయంలోనూ అదే పరిస్థితి. బహిరంగంగా నేతలు తిట్టుకున్న సీన్స్ ఇప్పటిదాకా చాలా కనిపించాయి. ఈ రెండు పార్టీల అసంతృప్త నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపించేది. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. రాహుల్ టూర్.. అటు బీజేపీలోకి వెళ్లాలనుకున్న కాంగ్రెస్ నేతల్ని.. ఇటు బీజేపీలో చేరదామని చూస్తున్న టీఆర్‌ఎస్ నేతల్ని.. కన్ఫ్యూజన్ లో పడేసిందని చెబుతున్నారు.
ఏ నాయకుడు ఎటు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నట్లుగా అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లూ ఏం జరిగిందో అందరికీ తెలుసు. రోజుకో గొడవతో వార్తల్లో నిలుస్తూ ఉండేది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక గొడవలు మరింత పెరిగాయి. కార్యకర్తల్లో కొత్త జోష్ తెచ్చేందుకు రేవంత్ రెండు అడుగులు ముందుకు వేస్తే.. సీనియర్లు నాలుగు అడుగులు వెనక్కి లాగిన పరిస్థితి కనిపించింది. పైగా.. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్‌ఎస్ లో చేరతారనే భావన ప్రజల్లోకి టీఆర్‌ఎస్, బీజేపీ గట్టిగానే తీసుకెళ్లాయి. అయితే.. రాహుల్ తెలంగాణ పర్యటనలో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో జోష్ తో పాటు ధైర్యం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే పక్క పార్టీలకు వెళ్లాలనుకున్న వారు కన్ఫ్యూజన్ లో పడ్డారని అంటున్నారు. ఇదే ఐక్యత కొనసాగితే కాంగ్రెస్ కు భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక టీఆర్‌ఎస్ అసంతృప్త నేతల విషయానికొస్తే.. అటు కాంగ్రెస్ కు వెళ్లాలా.. ఇటు బీజేపీలో చేరాలా అనేది తేల్చుకోలేకపోతున్నారట. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకటే.. కాంగ్రెస్ రాష్ట్రంలో లేదని ఇన్నాళ్లూ పార్టీ నాయకులు కదలకుండా కేసీఆర్ వ్యూహాలు రచించారని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే.. బీజేపీ, టీఆర్‌ఎస్ చర్యలు ఒకేలా ఉంటున్నాయని జనాల్లో చర్చ జరుగుతుండడంతో కేంద్రంపై యుద్ధం అంటూ హడావుడి చేశారని అంటున్నారు. కానీ.. ఇప్పటిదాకా బీజేపీనే ప్రత్యామ్నాయం అని భావించిన అసంతృప్త నేతలు ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతలకు రాహుల్ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చేశారు. వరంగల్ డిక్లరేషన్ ను జనాల్లోకి తీసుకెళ్లాలి.. పార్టీ కోసం పని చేసేవారికి అన్నీ అందుతాయి.. ఇలా చాలా క్లారిటీగా అటు నేతల్లో, ఇటు క్యాడర్ లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో బీజేపీ వైపు అడుగులు వేద్దామని అనుకున్న నేతలు అయోమయంలో పడినట్లే అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అటు చూస్తే టీఆర్‌ఎస్ నేతలది ఇదే పరిస్థితి అని చెబుతున్నారు.