వీలైతే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి వుండాలన్నదే వైసీపీ విధానమన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కవిత మద్యం కుంభకోణాన్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని, అందుకే వైసీపీ నేతలతో కలిసి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కూతురు రూ. లక్ష కోట్ల మద్యం దందా చేశారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కలిసి నాటకాలాడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.
పార్లమెంట్‌లో బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడంతోనే తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీతోనే పారదర్శక పాలన సాధ్యమన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
సజ్జల వ్యాఖ్యలపై వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివని ఫైర్ అయ్యారు. నేడు తెలంగాణ ఒక వాస్తవమన్నారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందన్నారు.
రెండు రాష్ట్రాలు కలవడమనేది అసాధ్యమన్నారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయన్నారు. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారంటూ ఆమె ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదని, మీ ప్రాంత అభివృద్ధి మీదంటూ ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసేందుకు అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం పార్లమెంట్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందన్నారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఉండొచ్చని, ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చన్నారు.
కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనప్పుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణపై మరోసారి దాడికి కుట్రగానే పరిగణించాల్సివుంటుందన్నారు.