తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బుధవారం నల్గొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నిజాయితీ పరుడని, ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ తర్వాత ఈ రాష్ట్రానికి కేటీఆరే అధినాయకుడని రేవంత్, బండి సంజయ్ లకు అర్థమైందని.. అందుకే కేటీఆర్ ను అప్రతిష్టపాలు చేసేందుకు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు అసత్యాలు ప్రచారం చేయడమే వారి పని అని దుయ్యబట్టారు గుత్తా సుఖేందర్ రెడ్డి. సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని.. రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకుందంటూ నిప్పులు చెరిగారు. గవర్నర్ వ్యవస్థ కూడా బీజేపీ వాళ్లు బ్రష్టు పట్టించారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో బిల్లులను పెండింగ్ లో పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గుత్తా.
కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అణిచివేత చర్యలకు పాల్పడుతుందన్నారు. అందుకు రాహుల్ గాంధీపై అనర్హత వేటే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం ముప్పుగా మారిందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలపై అనవసర కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు గుత్తా సుఖేందర్.
మోడీ ప్రభుత్వం తన మిత్రుడైన ఆధాని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే చర్యలు తీసుకోవడం లేదని గుర్తు చేశారు. రాఫెల్ కొనుగోలు అవినీతిని సైతం తొక్కి పెట్టారని దుయ్యబట్టారు. అలాగే లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అప్రతిష్ట పాలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు గుత్తా సుఖేందర్ రెడ్డి.