తెలంగాణలో రేషన్ తీసుకోవాలంటే ఇక నుండి ఆధార్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ డిపోలలో ఆధార్ వివరాలు ఇవ్వని కార్డుదారులంతా వెంటనే వివరాలు అందించాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బయోమెట్రిక్, ఐరిష్ నిర్ధారణల ద్వారా రేషన్ సరుకులు ఇచ్చే విధానం ఉండగా, ఇప్పుడు వాటికి తోడు ఆధార్ నమోదు కూడా తప్పనిసరి చేశారు.
2017లో కేంద్రం ఈ విధానాన్ని అనుసరించాలని తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కానీ ఆధార్ ను అన్నిటికి తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలపై గతంలోనే సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆధార్ తప్పనిసరి చేయటం సరైంది కాదని, ఇప్పటి వరకు ఉన్న గుర్తింపు కార్డుల్లాగే అది కూడా ఒకటి మాత్రమే కానీ ఆధార్ తప్పనిసరి చేయరాదని స్పష్టం చేసింది.
కానీ తెలంగాణ ప్రభుత్వం హాఠాత్తుగా ఆధార్ తప్పనిసరి ఉత్తర్వులను జారీ చేయటం ద్వారా… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధార్ ను తప్పనిసరి చేస్తే కార్డు లేని పేదల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.