టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్ననాటి నుండి… ఇంకా కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే రాజకీయ పార్టీగా మారకముందు నుండి కేసీఆర్ వెంట నడిచిన పిడికెడు మందిలో ఒకరు ఈటెల రాజేందర్. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ మౌత్‌పీస్. ప్రస్తుతం మంత్రి కూడా. కానీ కొంతకాలంగా ఈటెలపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారా? ఈటెలపై వేటుకు ముహుర్తం కోసం వెయిట్ చేస్తున్నారా…?
టీఆరెఎస్ రెండోసారి గెలిచాక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నచందంగా ఉంది ఈటెల రాజేందర్ పరిస్థితి. మొదట్లోనే ఈటెలకు మంత్రిపదవి దక్కకపోవచ్చని ఊహాగానాలు బలంగా వినిపించినా… తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రిపదవి ఇచ్చారు. రేపు ప్రమాణ స్వీకారం ఉంటే అర్ధరాత్రి ఫోన్ వచ్చే వరకు నమ్మకంలేని పరిస్థితి. ఇక మొన్నటి మంత్రివర్గ విస్తరణలో… ఈటెలను తప్పిస్తారన్న ప్రచారం కూడా జోరుగా ఉంది. రాష్ట్రంలో బీజేపి పుంజుకుంటున్న వాతవరణం ఉండటంతో కేసీఆర్ కాస్త వెనక్కితగ్గి… ఈటెలను కొనసాగించారన్న చర్చ సాగింది. కానీ ఇప్పుడు ఈటెల మంత్రిత్వ శాఖలో జరుగుతోన్న అవినీతి, మంత్రి మెడకు చుట్టుకునేలా ఉంది. హైదారాబాద్ నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుగతున్నాయన్న సంచలన వార్త బయటకొచ్చింది. దీనిపై ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీని కూడా వేసింది. అయితే…ఈ మరక ఈటెలకు అంటుకునేలా ఉందన్న చర్చ గులాబీ దళంలో జోరుగా సాగుతోంది.
చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతంటే… శాఖా మంత్రిగా ఈటెల ఏం చేశారు, చిన్నారుల మరణాలు ప్రభుత్వానికి ఎంత అప్రతిష్ట… దీనికి ఆయన కాకపోతే ఇంకెవరు బాధ్యత వహించాలి ఇలా రకరకాల కామెంట్స్ సీఎం కోటరి సన్నిహితుల నుండి వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, అనేక మంది మంత్రులపై… నేతల ఆద్వర్యంలో నడిచే సంస్థలపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా… ప్రభుత్వం చూసిచూడనట్లు వదిలేసింది. కానీ ఇటీవల ఈటెల రాజేందర్ గులాబీ పార్టీ ఓనర్లం అంటూ కామెంట్స్ చేస్తూ కాస్త హెచ్చరిక ధోరణితో మాట్లాడటంతో… అధిష్టానం నేతలకు, ఈటెలకు మధ్య సఖ్యత లేదన్నది తేటతెల్లం అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో, ఈటెల రాజేందర్ శాఖలో చిన్నారులపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో ఖచ్చితంగా బాధ్యున్ని చేస్తారని ప్రచారం సాగుతోంది. మరీ, కేసీఆర్ ఈసారికి ఈటెల అంశాన్ని లైట్ తీసుకుంటారో, లేక సరైన ముహుర్తంగా భావించి వేటు వేస్తారో చూడాలి.