కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ఏమన్నా చేసింది ఉందంటే.. అది గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప ఇచ్చేందేమీ లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్ని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. కేసీఆర్ పాలనలో కాలంతో పని లేకుండా రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టుల్ని నిర్మించామన్నారు. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదు కాబట్టే తెలంగాణకు రావాల్సిన 12 వేల కోట్ల రూపాయలను కేంద్రం ఆపిందని మండి పడ్డారు. హరీష్ రావు. మీటర్ల మాట నిజం కాకపోతే రూ.12 వేల కోట్లు ఎందుకు ఆపారని ప్రశ్నించారు హరీష్ రావు. ఇందుకు సమాధానం చెప్పితీరాలని డిమాండ్ చేశారు.
పంటకు ఐదు వేలు అందించి, రైతులకు పెట్టుబడి సహాయం చేసిన ఘనత టీఆర్ఎస్ ది కాదా? అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా రైతు బంధు ఇస్తున్నారా? దమ్ముంటే చెప్పండని ప్రశ్నించారు. జై జవాన్.. జై కిసాన్ అనే నానుడి లేకుండా ఓ వైపు రైతులకు గోస పెడుతూ.. మరో వైపు అగ్నిపథ్ తో దేశ యువతను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు.
ఇప్పటివరకూ 87 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4333 కోట్ల సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ లేదని.. ఒక్క కేసీఆర్ సర్కార్ హయాంలోనే అమలు అవుతుందని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 54 వేల మందికి నెల నెలా ఆసరా పింఛన్లు కూడా అందిస్తున్నామని వెల్లడించారు హరీష్ రావు.