‘బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్’ అంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడే మందుల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అన్నారు హరీష్. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మెడిసిన్స్‌తో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందన్నారు మంత్రి హరీష్.
మందుల ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడిందని ఫైర్ అయ్యారు. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని.. ఇది అత్యంత బాధాకరమని ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.
కాగా ఇటీవల మంత్రి హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని హరీష్‌రావు తెలిపారు.
అర్హులైనవారు వ్యాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని, అన్ని పీహెచ్ సీ, యూపీహెచ్ సీలలో వాక్సిన్ అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణకు మరిన్ని వ్యాక్సిన్ డోసులు సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.