బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచనలు చేశారు. కేంద్రం భారీగా పెంచిన గ్యాస్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపు నిచ్చారు కేటీఆర్. బుధవారం మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తోందని ఫైర్ అయ్యారు.
లేటెస్ట్ గా గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350కి పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని మోడీ ఇచ్చే కానుక ఇదేనా? అంటూ నిలదీశారు. మోడీ ప్రభుత్వం రాక ముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.1200లకు చేరుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు.
మోడీ సర్కార్ మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేసుకునేలా చేస్తోందని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు నిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు.