జహీరాబాద్ లోని నిమ్జ్ లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. రక్షణ రంగం పరిశ్రమల హబ్ హైదరాబాద్ అన్నారు. డిఫెన్స్ కారిడార్ ను హైదరాబాద్-బెంగళూర్ మధ్య ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.
యూపీలోని బుందేల్ ఖండ్ కు ఏ అర్హతలు లేకున్నా.. అధికారం చేతిలో ఉందని డిఫెన్స్ కారిడార్ ను కేంద్రం కేటాయించిందని మండిపడ్డారు కేటీఆర్. మౌలిక వసతులు లేకుండా డిఫెన్స్ కారిడార్ ఇవ్వగానే పెట్టుబడులు తరలిరావని వ్యాఖ్యానించారు. ప్రగతిశీల రాష్ట్రం అయిన తెలంగాణను కేంద్రమే ప్రోత్సహించాలని చెప్పారు. సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్ వారికి పరిశ్రమ యజమాన్యం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
12,600 ఎకరాలు భూమి నిమ్జ్‌కు కేటాయిస్తే.. ఇప్పటికి 3,500 ఎకరాలే సేకరించినట్లు వివరించారు కేటీఆర్. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని.. అదేవిధంగా భూమి కోల్పోతున్న రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, వెమ్ టెక్నాలజీ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు.
అంతకుముందు కేటీఆర్ ను రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు గ్రామాల నుంచి బయటకి రాకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. నిమ్జ్ భూసేకరణకు వ్యతిరేకంగా పలు గ్రామాల్లో రైతుల ఆందోళనలు చోటు చేసుకున్నాయి.