ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. పాలమూరు ఎంపీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ నాయకులు అంటున్నారు.
అసలు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతవు అని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు – రంగారెడ్డి పథకానికి మోకాలడ్డు పెట్టినందుకా? కృష్ణా జలాల్లో నీటి వాటాలు తేల్చనందుకు ఓటు వేయాలా..? మా పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ఓటు వేయాల్నా? అని కేటీఆర్ నిలదీశారు.
ఇక మోదీ దేవుడు అని ఒకాయన అంటుంటుండు. ఆయన ఎవరికి దేవుడు అని కేటీఆర్ ప్రశ్నించారు. సిలిండర్ రేటు పెంచి కట్టెల పొయ్యి దిక్కు చేసినందుకు ఆడబిడ్డలకు మోదీ దేవుడా? పెట్రోల్ రేట్ పెంచినందుకు మోదీ దేవుడా..? ధరల పెరుగుదలకు కారణం ఎవరు.. మోదీ కాదా..? అని కేటీఆర్ మండిపడ్డారు.
నారాయణపేట జిల్లాలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. మొదట సింగారం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేకగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు సీటులో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కూర్చుండబెట్టారు.