– బరాబర్ ఇది వసుధైక కుటుంబమే!
– మాకు కులం పిచ్చి లేదు
– మతం పిచ్చి లేదు
– ఒక పిచ్చోడు ప్రగతిభవన్ పేల్చేస్తాం అంటాడు
– మరోకడు సచివాలయం కూల్చేస్తాం అంటున్నాడు
– పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ప్రజలకే ఇబ్బంది
– ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటున్నారు
– ఉమ్మడి వరంగల్ టూర్ లో కేటీఆర్
హైదరాబాద్, తొలివెలుగు: తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇండియాలోని ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పొరుగు ఉన్న రాష్ట్రాల్లోని ప్రజలు, సర్పంచులు తెలంగాణలో కలుస్తామని ఎందుకంటున్నారని అడిగారురు. ఇక్కడి పరిస్థితిని చూసే వారు తెలంగాణలో కలుస్తామని కోరుతున్నారని చెప్పారు. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు కేటీఆర్. పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు గురుకుల పాఠశాలను, బీఆర్‌ఎస్ కార్యాలయం, డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించారు.
భూపాలపల్లి పట్టణంలోని మంజు నగర్ లో రూ.3 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆతిథి గృహాన్ని , రూ.23 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని, జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. టూర్ లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు ‘మాది మూమ్మాటికి కుటుంబ పాలనే.
అవును. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యులే. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితుల నుంచి.. నేనుపోతా సర్కారు దవాఖానకే అనే పరిస్థితులను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. బరాబర్ ఇది వసుధైక కుటుంబమే. మాకు కులం పిచ్చి లేదు. మతం పిచ్చి లేదు. ఒక పిచ్చోడు ప్రగతిభవన్ పేల్చేస్తాం అంటాడు. మరోకడు సచివాలయం పేల్చేస్తాం అంటున్నాడు.
ఒకడితో మరోకడు పోటీ పడుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి మనుషుల చేతుల్లో రాష్ట్రం పెడితే ఆగమైతది. వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా..? తెలంగాణ రాకపోతే వీళ్లను ఎవరైనా గుర్తించేవారా..? వాళ్ల మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కచాన్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కుంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేశారు.