మంత్రి శ్రీనివావాస్ హత్య కుట్ర కేసులో అరెస్ట్ అయిన ఏడుగుర్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుండి ముందుగా అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
నిందితులను తరలించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అంటున్నాయి మీడియా వర్గాలు. నాటకీయ పరిణామాల మధ్య వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారని చెబుతున్నాయి. వారున్న వాహనాన్ని పూర్తిగా రగ్గులతో కప్పి తీసుకెళ్లారు పోలీసులు.
ఏడుగుర్ని మీడియా కంట పడకుండా సినీ ఫక్కీలో తరలించారు. చర్లపల్లి జైలు నుండి రెండు పోలీస్ స్టేషన్లకు మార్చి పేట్ బషీరాబాద్ పీఎస్ కి పట్టుకెళ్లారని అంటున్నాయి మీడియా వర్గాలు.
నిందితులను అరెస్ట్ చేసినప్పుడు గానీ.. రిమాండ్ కి తరలించినప్పుడు గానీ.. ఇప్పుడు కస్టీడీకి తీసుకున్నప్పుడు గానీ.. వీడియోలు, ఫోటోలు తీయకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే పీఎస్ కు వచ్చే ఫిర్యాదుదారులకు కూడా అనుమతి ఇవ్వలేదు. గేట్ మూసేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసులో ఏడుగుర్ని 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. వీడియో రికార్డింగ్ మధ్య పోలీసుల విచారణ సాగనుంది. కుట్ర కేసుపై వివిధ కోణాల్లో వివరాలు సేకరించనున్నారు.