ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల భేటీ అయ్యారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పొందుపరిచిన అంశాలు సక్రమంగా అమలవుతున్నాయా..? లేదా..? అనే అంశాలపై రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో భేటీ జరిగింది.
మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సమీక్షించడంతో పాటు.. పాఠశాలల ప్రారంభం వరకు పూర్తి చేయాల్సిన సమస్యలపై మంత్రులు మాట్లాడుకున్నారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చించారు.అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై.. అందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రులు సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది.