చట్టాలు పాలకులకు చుట్టాలుగా మారిపోతున్నాయా..? తామే చేస్తున్న చట్టాలు తమకు వర్తించవా…? సామాన్యున్ని రోడ్డు మీద ఆపి ముక్కుపిండి మరీ వసూలు చేసే ట్రాఫిక్ పోలీసులకు ఆమాత్యుల వాహనాలు కనపడటం లేదా..? రాష్ట్రంలో సామాన్యునికో న్యాయం, ఆమాత్యులకో న్యాయామా…? వేలకు వేలు చలానాలు పడ్డా ఆ నేతలకు జరిమానాలు, శిక్షలుండవా…?
తెలంగాణలో మంత్రివర్యుల ట్రాఫిక్ చలానాల లిస్ట్ చూస్తే… పోలీస్ శాఖలో కొంతమందికి ఓ నెల జీతాలు కూడా ఇచ్చేయెచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదంటే భారీగా జరిమానా ఉంటుందని పోలీస్ వారు పదే పదే చెప్తుంటారు. లేకపోతే… చార్జీషీట్ వేస్తామని జంక్షన్ల వద్ద ఆడియో ప్లే చేస్తారు. సామాన్యులు ఎవరైనా గతంలోని ఫైన్ కట్టక, తర్వాత దొరికితే చాలు… పాతవి, కొత్తవి కలిపి నడీ రోడ్డుమీద వసూలు చేస్తారు. లేదంటే వాహనం జప్తే. మరీ మంత్రి వర్యులకు మాత్రం ఆ రూల్ వర్తించటం లేదు. ఒక్కో మంత్రి వాహనంపై వేలకు వేలు జరిమానాలు పెండింగ్ లోనే ఉన్నాయి. వీటికి తోడు కాన్వాయ్ లో మిగతా వాహనాలను కూడా అబ్జర్వ్ చేస్తే… లక్షల్లో కట్టాల్సి వస్తుందేమో.
ఆ మంత్రి, ఈ మంత్రి అన్న తేడా లేదు… తొలివెలుగు సేకరించిన సమాచారం ప్రకారం…
మంత్రి హరీష్ రావు– వెహికల్ నెం TS09PA3231– తొమ్మిది వేలకు పైచిలుకు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి– TS09PA3186–రెండు వేలకు
మంత్రి జగదీశ్వర్ రెడ్డి– TS09PA3198–తొమ్మిది వేలకు పైచిలుకు.
కేవలం ఈ నలుగురే కాదు… ప్రతి మంత్రి వాహానానికి దాదాపు ఇలాగే చలానాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే… ఇవి మంత్రులకు ఇచ్చిన అధికారిక వాహనాలు. ప్రతి మంత్రి వాహనానికి కాన్వాయ్ ఉంటుంది. సో… ఆ వాహనాల చలాన్ లు కూడా దాదాపు ఇంతే ఉంటాయి. కొంతకాలంగా ఓఆర్ఆర్ తో పాటు ముఖ్యమైన రాహదారుల్లో పోలీస్ శాఖ స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసింది. వాహనం వేగం 100 దాటితే…. వెంటనే 1000 చలాన్ తో పాటు 35 రూపాయా సర్వీస్ చార్జీ వేస్తున్నారు.
అయితే, ఎప్పుడయినా… పోలీస్ శాఖ వాహనాలు రోడ్లపై ట్రాఫిక్ వయలేషన్ చేస్తే సోషల్ మీడియాలో పెడితే మాత్రం మేమూ ఫైన్ కట్టాం, రూల్ ఇజ్ రూల్… రూల్ ఫర్ అల్ అంటూ సదరు అధికారులు ట్విట్టర్ ద్వారానో, ఫెస్ బుక్ ద్వారానో స్పందిస్తారు. మరీ ఇప్పుడు మంత్రులు స్పందిస్తారో, లేదా పోలీస్ శాఖే స్పందిస్తుందో చూడాలి.