హైదరాబాద్‌లోని అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటన ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఆ సమయంలో పిల్లాడి ఎంత బాధను అనుభవించి ఉంటాడనే బాధ ప్రతి ఒక్కరినీ వెంటాడింది. ఆ పిల్లాడి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదంటే.. కనీస జాగ్రత్తలు పాటించాలి.
ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా వదలకూడదు. సాధారణంగా కుక్క కాటు కేసులు ఎక్కువగా వేసవిలోనే కనిపిస్తాయి? అసలు ఎందుకు కుక్కలు ఇలా వేసవిలోనే పేట్రేగిపోతాయి? ఇందుకు కారణం ఏమిటీ కుక్క కరిస్తే ఏం చెయ్యాలి? తదితర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎండాకాలంలో ఎండ వేడి వల్ల కుక్కలు చాలా చికాకు పడుతుంటాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.
ఆ మాటకు ఊతమిస్తున్నట్టే నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో కుక్కకాటుకు గురై చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందట. దాదాపుగా 250 నుంచి 300 మంది కుక్కకాటు చికిత్స కోసం వేసవిలో ప్రతి రోజు వస్తుంటారని అక్కడి అధికారులు అంటున్నారు.
మనుషుల లాగే కుక్కలు కూడా వేసవిలో వేడి తట్టుకోలేవని అందువల్ల కుక్కలు చాలా దూకుడుగా ఉంటాయని ‘సైకాలజీ టుడే’ అనే మ్యాగజైన్ కామెంట్ చేస్తోంది.
వేసవిలో తిండి, నీళ్లు తగినంత దొరకనందువల్లే కుక్కల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల వీధికుక్కలు ఎక్కువ మందిని కరుస్తాయట. వీధి కుక్కలు మాత్రమే ఇలా ఉంటాయనుకుంటే తప్పే. పెంపుడు కుక్కల్లో కూడా 28 శాతం వరకు వేసవిలో ఇలా అగ్రెసివ్ గా ఉంటాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
వేసవిలో వీలైనంత వరకు కుక్కలకు దూరంగా ఉండడమే మంచిది. పెంపుడు కుక్కలైతే డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేయించి జాగ్రత్తగా చూసుకోవాలి. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే.. మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదా వాటి కోసం ప్రత్యేకంగా నీరు అందుబాటులో ఉంచాలి. దానివల్ల అవి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటాయి. ప్రజలు కూడా సేఫ్.
అలాగే.. నగరంలోని అన్ని పాఠశాలల్లో వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం తెలిపింది. కాలనీ సంఘాలు, బస్తీల్లో వీధి కుక్కలతో జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని పేర్కొంది. శానిటేషన్ సిబ్బంది అయా ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇక మూసీ పరివాహక, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే కుక్కలకు సైతం ఆపరేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని.. కుక్క కాటు బాధితులకు వెంటనే వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.