నిన్న మునిసిపల్ ఎన్నికల అనుమతి హైకోర్ట్ నుంచి వస్తుందని ఆశించిన కారుబాబులు, కేసు 26 వ తారీఖుకి వాయిదా పడటంతో, నిరాశ చెందారు. చిన్న చిన్న లోపాలున్నా ఎన్నిక ఆగకూడదని గతంలో చెప్పిన కోర్ట్ ఈరోజు వాయిదా వెయ్యడం తమకు అన్యాయం చెయ్యడమని గులాబీ నేతలు బాధపడుతున్నారు. దీనికంతటికి కారణం బీజేపీ రధం తెలంగాణా లో వేగం పెంచడం. బీజేపీ తన నిర్మాణాన్ని పటిష్టపరుచుకునేలోపు మున్సిపల్ ఎన్నిక జరిగితే కారు వేగంగా దూసుకుపోతుందని తెరాస అంచనా. ఈ ఎన్నిక తేదీ దూరంగా జరిగే కొద్దీ కమలం బలపడుతుందని వారి ఆందోళన. హైదరాబాద్ చుట్టుపక్కల మునిసిపాలిటీలతో పాటు తెలంగాణా మునిసిపాలిటీలలో ఎన్నిక అధికారపక్షానికి సవాలుగా మారింది.
కమలనాధులు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని మత విద్వేషం పెంచడానికి ఉపయోగిస్తే కారుకు నష్టం తప్పదని అంచనాలు జోరందుకుంటున్నాయి.
మరో పక్క హుజూర్ నగర్ ఎన్నిక తేదీ కూడా మిగతా రాష్ట్ర ఉపఎన్నికలతో పాటు ప్రకటించకపోవడం గులాబీ బాబులకు ఆందోళన పెంచుతోంది. ఆ ఆలస్యం బీజేపీకి కలిసి వస్తుందని మరింత ఆందోళన పడుతున్నారు.
మరో పక్క బీజేపీ పట్ల అనుసరించాల్సిన వైఖరిలో కూడా కారులో గందరగోళం కనిపిస్తోంది. కేంద్రపార్టీతో మైత్రి, రాష్ట్రపార్టీ తో శత్రుత్వం తమ పాలసీ అని నిన్న మొన్నటిదాకా తెరాస శ్రేణులు చెప్పేవి. ఐతే కెసిఆర్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే అన్ని తప్పులకు కేంద్రం కారణమని చెప్పడంతో పరిస్థితి మారింది.