మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీల్లో ఒకింత టెన్షన్ ఉన్నా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అధిష్టానం అప్పచెప్పిన బాద్యతమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కోలాహలం మొదలయింది. వార్డుల రిజర్వేషన్ ఖరారు కావటంతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు, నాయకులు అంతర్గత సమావేశాలతో బిజీ అయ్యారు. ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న కొంత మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం లో బిజీ గా ఉండగా…టిక్కెట్టు దక్కని వారిని బుజ్జగించే పనిలో నేతలున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోరుకు సిద్ధమయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్ అనే సిద్ధాంతంతో అడుగులు వేయడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ సారీ ఎలాగైనా మున్సిపాలిటీల్లో పాగా వేయడానికి బీజేపీ ప్యూహం రచిస్తుంటే.. అధికార పార్టీ టీఆరెస్ కూడా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొని ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పుర పోరుకు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే టీపీసీసీ జిల్లాల వారీగా ఇంచార్జ్ లను నియమించి స్థానిక నేతలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తుంది. నామినేషన్ల చివరి తేదీ గడువు సమీపిస్తుండడంతో పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నా మూడు నాలుగు స్థానాలపై మాత్రం ప్రత్యేక దృష్టిసారించింది. ఇక బీజేపీ తమ పార్టీ నుంచి గతంలో కౌన్సిలర్లు, వైస్‌ఛైర్మన్లుగా గెలిచిన జనగామ, పరకాల, భూపాలపల్లి స్థానాలపై కన్నేసింది. పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలను నియమించుకొంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. టీడీపీ,వామపక్షాలు పోరుకు సిద్ధమవుతున్నప్పటికీ ఆ పార్టీల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి పొత్తులు లేవు. ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలవనున్నాయి.
ఈ ఎన్నికల నేపథ్యంలో తాజాగా అధికార టీఆరెస్ మంత్రులు,ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి తమ పరిధిలో విజయఢంకా మోగించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసారు. టీఆరెస్ అభ్యర్ధులు ఓడితే మంత్రుల పదవులకు కూడా ఎసరు వచ్చేటట్లు ఉండడంతో మంత్రులు ఉదయం 6 గంటలనుండే పల్లె బాటపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మిగతా ప్రజాప్రతినిధులంతా మున్సిపల్ పోరుపైనే పూర్తి దృష్టిసారిస్తున్నారు. మిగతా పార్టీల నేతలు కూడా ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుండడంతో రాజకీయం వరంగల్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నడూ కానరాని నేతలు ఉదయాన్నే తమ ముందుకు రావడంతో ఓటర్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.