ఆ రెండు రోజులు ఢిల్లీలో ఏం జరిగింది..? ప్రోటోకాల్ వేణుగోపాల్‌పై ఉత్తమ్ నోరెందుకు పారేసుకున్నారు ? కేవీపీని అహ్మద్ పటేల్ ఏమన్నారు ? తెలంగాణ పీసీసీని మారుస్తున్నామని జాతీయ మీడియాకు చెప్పిన కాంగ్రెస్ పెద్దలు మళ్ళీ వెనక్కి ఎందుకు తగ్గారు? టీపీసీసీ నేతగా రేవంత్ అనే వార్త బయటకు రావడంతో కేవీపీ, ఉత్తమ్, భట్టి, వీహెచ్, పొన్నం ప్రభాకర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు… ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.
ఢిల్లీ: పీసీసీని మారుస్తున్నారనే వార్త తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక పార్టీకి మంచి రోజులు వచ్చాయని ఆశపడ్డ కార్యకర్తలకు కుంతియా స్టేట్మెంట్ తీవ్ర నిరాశని మిగిల్చింది. ఈమధ్య కాలంలో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని సోనియాగాంధీ తాజాగా రేవంత్ కుటుంబ సభ్యులను పిలిపించుకోవడం.. వాళ్ళతో 40 నిమిషాలు మాట్లాడటం అంటేనే అక్కడ ఏదో జరుగుతోందని అందరూ అనుకున్నారు. రేవంత్‌రెడ్డికి సోనియా ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఈ మీటింగ్ చాలు చెప్పడానికి. ఆ 40 నిమిషాలు సోనియాగాంధీ రేవంత్ మధ్య ఎటువంటి చర్చ జరిగిందోనని కాంగ్రెస్ పెద్దలంతా కంగారుపడిపోయి తెల్లారేసరికి ఢిల్లీలో దిగిపోయారు. కాంగ్రెస్‌లో లాగే వాళ్లు వుండరు కానీ, వెనక్కి లాగేవారి సంఖ్య మాత్రం చాంతాడంత వుంటుంది. ఎవరికి వారికి అక్కడ సొంత లాబీలు వుంటాయి. ఇక్కడ రాష్ట్రంలో వుండే సీనియర్లు ఎవరికీ పార్టీ ప్రయోజనాలు అవసరం లేదు. తమ ప్రాభవం బాగుంటే చాలు… రేవంత్‌కు ఒకసారి అవకాశం ఇచ్చి అందరూ సహకరిస్తే చూడొచ్చు కదా.. అని కాంగ్రెస్ క్యాడర్ తిట్టుకుంటోంది.
ఇక సోనియాగాంధీ అంతసేపు రేవంత్‌రెడ్డితో ఏం చర్చించారనేది తెలుసుకునేందుకు ప్రయత్నించిన నేతలంతా.. ఢిల్లీలో తమ ‘ఆత్మా’నందాన్నిపుంచుకున్నారు. అక్కడ వారంతా కలిసి ఒక వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు సమాచారం. రేవంత్‌కు కాకుండా ఉత్తమ్‌ను కొనసాగించండి.. లేదా మా ముగ్గురిలో ఒక్కరికి అవకాశం ఇవ్వండి అనే ప్రపోజల్ తీసుకుని కేవీపీ ద్వారా అధిష్టానానికి అందించారు. రాయబారం తీసుకెళ్లిన కేవీపీకి అహ్మద్ పటేల్ క్లాస్ తీసుకున్నారట. కేవీపీ తీసుకెళ్లిన ప్రతిపాదనలో ఆ నాలుగు నేతల పేర్లు చదివి వారి గురించి ఫుల్ క్లాస్ పీకారని తెలుస్తోంది. గతంలో ఆ నలుగురి పనితీరు గురించి ఘాటుగా స్పందించారని భోగొట్టా.
‘మీరు చెప్తున్న ఆ నలుగురి పనితీరు మీకు తెలియదా’ అంటూ సీరియస్ అయ్యారని కబురు. ‘‘ఉత్తమ్ 2014 ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ తరువాత అతన్ని ప్రెసిడెంట్ కూడా చేశాం.. ఉత్తమ్ ప్రెసిడెంట్ అయ్యాక ఏ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. 2014 నుంచి 2019 వరకు తెలంగాణ కాంగ్రెస్ ఏ సమస్యపై కానీ ప్రజల్లోకి వెళ్ళింది లేదు.. మా దగ్గర అన్ని రిపోర్టులూ ఉన్నాయి. ఇక తెలంగాణలో అధికారంపై ఆశ వదులుకోవాలని అనుకుంటేనే ఉత్తమ్‌ను కొనసాగించాలి. భట్టి విక్రమార్కకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాం. గత ఐదేళ్లుగా వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కూడా అవకాశం ఇచ్చాం.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో మీకు తెలియదా..? ఆశించిన ఫలితాలు రాకపోయినా సీఎల్‌పీ నేతను చేస్తే ఒక్క ఎమ్మెల్యేను కూడా పార్టీ మారకుండా కాపాడలేకపోయాడు.. భట్టి వ్యవహారశైలి వల్లే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి వెళ్లినట్లు మాదగ్గర రిపోర్ట్ వుంది. పొన్నం ప్రభాకర్, వీహెచ్.. ఈ ఇద్దరిలో ఎవరికైనా అంత సీన్ వుందా.? వారికి పీసీసీ ఇమ్మని మీరు అడుగుతున్నారు అంటే మీకు తెలంగాణ పార్టీ బ్రతకడం ఇష్టం లేదని మేము అనుకోవాల్సి వస్తుంది. వీహెచ్ చాలా సీనియర్.. ఆయనంటే మాకు మంచి గౌరవం ఉంది. కానీ, ఆయన పార్టీని కాపాడలేరు. సీనియర్‌గా గౌరవిద్దాం కానీ, పార్టీ పగ్గాలు ఇవ్వలేం. ఇక పొన్నం ప్రభాకర్ గత రెండు ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్యేగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా మళ్ళీ ఎంపీగా అవకాశం ఇస్తే కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. పార్టీ అనేది బ్రతికితే కదా కొత్త పాత అనేది ఉండడానికి.. మొదట తెలంగాణలో పార్టీని బ్రతికించే లీడర్ కావాలి. అతనికే పీసీసీ ఇవ్వాలి.. ఇదే మా డెసిషన్..’’ అంటూ కాంగ్రెస్ పెద్దాయన నుంచి సమాధానం రావడంతో కేవీపీకి నోట మాట రాలేదట. చేసేది లేక పీసీసీ ఎవరికైనా ఇవ్వండి కానీ.. ఇంకొన్ని నెలలు ఆగండి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.. అని చెప్పి అక్కడినుంచి బయటకు వచ్చారట.
కేవీపీ వచ్చేశాక.. అక్కడే ఉన్న ఆంద్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేతతో అహ్మద్ పటేల్ ‘చూశారా.. ఇది తెలంగాణలో పరిస్థితి. పార్టీ బ్రతకడం సీనియర్లకే ఇష్టం లేదు. మనం ఏం చేస్తాం’ అని ఆవేదన వ్యక్తం చేశారట.
కుంతియాతో భేటి అయినా ఆ నలుగురు నేతలు ఎట్టి పరిస్థితుల్లో పీసీసీ మార్చకూడదని సీరియస్‌గా చెప్పారని సమాచారం. ప్రోటోకాల్ వేణుగోపాల్‌పై ఉత్తమ్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది. ‘నువ్వే తెలంగాణ పరిస్థితులు అధిష్టానానికి చెప్తున్నావ్.. నా పనితీరు బాగోలేదా, పీసీసీని మారుస్తున్నామని నువ్వే ప్రచారం చేస్తున్నావ్’ అని గట్టిగా అరవడంతో వేణుగోపాల్ కూడా అదే స్థాయిలో ఉత్తమ్‌కు సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ‘మీ పనితీరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.. తెలంగాణలో ఏ కార్యకర్తను అడిగినా చెప్తాడు..’ అని వేణుగోపాల్ రిప్లయ్ ఇచ్చాడని తెలిసింది. ఈ రచ్చను చూసిన అధిష్ఠానం పీసీసీ మార్పుపై ఇంకా కొన్ని రోజులు వేచి చూడాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. సాయంత్రంలోపు కొత్త పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ఆశలపై కేవీపీ చాణక్యత ప్రదర్శించి నీళ్లు చల్లారు.