ప్రతిపక్షాల విమర్శలను తెలంగాణ ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది. కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టకుండా… కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టిందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం 400కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సిద్ధం అయ్యింది.
కొత్త సచివాలయం నిర్మాణానికి ఇప్పటికే క్యాబినెట్ ఓకే చెప్పటంతో… రోడ్లు-భవనాల శాఖ పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక అంచనాలతో అధికారులు 400కోట్లకు అనుమతులు జారీ చేయగా… వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.
పాత సచివాలయం కూల్చిన చోటనే కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ కాగా, ఇప్పటికే సచివాలయం కొత్త భవనాల డిజైన్లు సైతం ఖరారయ్యాయి. ప్రతి ఫ్లోర్ లో సమావేశ మందిరాలు, డైనింగ్ హాల్స్, అత్యాధునిక చాంబర్లు ఉండనుండగా… ఈ సీఎం కార్యాలయం పూర్తి బుల్లెట్ ప్రూఫ్ తో తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇక్కడ బహుళ అంతస్థుల శాశ్వత భవనాలు కట్టడం నిషేధమని, ప్రభుత్వం మొండిగా వెళ్తే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎదురుదెబ్బలు తప్పవని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.