బీజేపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బ్రిటీష్ వాళ్లు అనుసరించిన విభజించు, పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందన్నారు.
తన మిత్రుల కోసం దేశాన్ని ప్రధాని మోడీ కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫిబ్రవరి 7న నిండు సభలో ఆదానీ కుంభకోణంపై బీజేపీ సర్కార్‌ను రాహుల్ గాంధీ ప్రశ్నించారన్నారు. దీంతో మోడీ ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
బీజేపీ డబుల్ ఇంజన్ ఆదానీ-ప్రధాని అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనపై కుట్ర చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై ప్రధాని కుట్ర చేసి అనర్హత వేటు వేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు.
మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… వ్యాపార ముసుగులో బ్రిటిషర్స్ దేశంలో అడుగుపెట్టింది గుజరాత్‌లోని సూరత్‌లోనే అని పేర్కొన్నారు.
బ్రిటీష్ దొరలను దేశం నుంచి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. గాంధీ, నెహ్రు, పటేల్ దేశ నిర్మాణానికి పునాదులు వేశారని వెల్లడించారు. సర్దార్ పటేల్‌కు బీజేపీకి సంబంధమేంటో అమిత్ షా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్.ఎస్.ఎస్‌ను నిషేధించింది సర్దార్ పటేల్ అని చెప్పారు.
నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ భారత సహజ వనరులను కొల్లగొట్టారన్నారు. ఇప్పుడు బ్రిటీష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతోందన్నారు.