తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతండటంతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపడుతోంది. కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్నారు, మరణించిన వారికి టెస్టులు చేయటం లేదు, ప్రైమరీ కాంటాక్టులకు కూడా సరిగ్గా టెస్టులు చేయటం లేదన్న ఆరోపణల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో… 60 యేండ్లు దాటిన ఏ ఒక్కరూ బయటకు రావద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వారంతా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావటానికి వీల్లేదని, ఎవరైనా ఒంటరిగా ఉంటున్న వారు నిత్యవసర సరుకులకు ఇబ్బంది పడితే డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులే వచ్చి ఇస్తారని ప్రకటించారు.
మందులు, నిత్యవసర సరుకులు, ఇంకా ఎలాంటి అవసరమైనా 100కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసులు మీ ఇంటికే వచ్చి సహాయం చేస్తారు. వారందరికీ అండగా ఉంటామని తెలంగాణ డీజీపీ ప్రకటించారు. వయస్సు పైబడ్డ వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వారంతా త్వరగా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.