తెలంగాణలో విపక్షాల ఆలోచనా విధానం జనానికి నవ్వును తెప్పిస్తోంది. తెల్లారితే చాలు మీడియా ముందుకొచ్చి సర్కార్‌ను కడిగిపారేసే పార్టీలు.. హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ వ్యవహరిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. సందర్భం వస్తే చాలు అధికార పార్టీ గద్దె కూలుస్తాం.. జెండా పీకేస్తాం.. అంటూ భారీ డైలాగులు చెప్పే ఆయా పార్టీల నేతలు.. ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చినా అడుగు ముందుకు వేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలకనే పార్టీలు ప్రస్తుతం అరడజనుకుపైనే ఉన్నాయి కానీ హుజురాబాద్‌లో చూస్తే మూడు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ మాటలే తప్ప.. అక్కడ ఇంకా అడుగు పెట్టనేలేదు. ఉప ఎన్నికలో పోటీ చేస్తామని మాత్రం స్పష్టంగానే చెబుతోంది. అయితే మిగిలిన పార్టీలు అసలు హుజురాబాద్ వైపే కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. పోటీ చేయపోయినా సరే.. కనీసం ఏదో ఒక పార్టీకి మద్దతివ్వడమో.. లేదా ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడమో ఆన్న ఆలోచన కూడా వాటికి లేకపోవడం విచిత్రంగా మారింది.
హుజరాబాద్‌లో పోటీపై టీటీడీపీ ఇంకా ఏం నిర్ణయించుకోలేకపోతోంది. అయితే ఇటీవల పార్టీ వీడిన ఎల్. రమణకు కౌంటర్ ఇవ్వడానికైనా అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచన చేస్తోంది. అయితే సాగర్‌లో డిపాజిట్ కోల్పోయిన అనుభవం ఉండటంతో తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (TJS) కూడా ఈ విషయంలో ముందూ వెనకాడుతోంది. మొదట్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ వైఫల్యాలను బహిర్గతం చేయాలని అనుకుంటున్నామని.. తదుపరి నిర్ణయం జిల్లా నేతలకే వదిలేయాలని భావిస్తున్నట్టుగా చెబుతోంది.
ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారేగాక హుజురాబాద్ పక్కనే ఉన్న హుస్నాబాద్ నుంచి పోటీ చేసి ఉన్నప్పటికీ.. ఆయన కూడా పార్టీ నిర్ణయం ప్రకటించలేదు. సీపీఎం సంగతి సరేసరి. అటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇప్పటికే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. జనసేన బీజేపీకే సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రాలు దాటి మరీ పోటీ చేసే ఎంఐఎంకు..తెలంగాణలో మాత్రం హైదరాబాద్ దాటి రావాలంటే ఏదో భయం. పైగా ప్రస్తుతం గులాబీ పార్టీతోనే అంటకాగుతోంది కూడా. ఏదేమైనా.. ముందే ఓటమి భయంతోనో.. డిపాజిట్ దక్కదన్న ఆలోచనతోనో పార్టీలు పోటీకి దూరంగా ఉండటం.. ఆయా పార్టీలకు అంతిమంగా నష్టమే తప్ప లాభం కాదని అంటున్నారు విశ్లేషకులు. పోటీచేయకుండా ఎన్నికల్లో ముందే ఆయా పార్టీలు ఓడిపోయినట్టు అయిందని వారు విశ్లేషిస్తున్నారు.