తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన ఉద్యమకారుడంటూ గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వరుసగా ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ పై అవినీతి ఆరోపణల ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతుంది.
ముఖ్యంగా మియాపూర్ భూముల స్కాం కేసులో ముందు కనిపించింది గోల్డ్ స్టోన్ ప్రసాద్ అయినా తెర వెనుక ఉండి చక్రం తిప్పింది మొత్తం కేసీఆర్ బంధువులేనన్న ప్రచారం జరిగింది. తాజాగా ఇదే గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేరు హాఫీజ్ పేట భూముల్లో కూడా గట్టిగా వినిపిస్తుండగా… ఇక్కడా కేసీఆర్ సన్నిహితుల పేర్లే తెరపైకి వస్తున్నాయి.
ఇక ప్రాజెక్టుల్లో అవినీతి, మూడో టీఎంసీ పేరుతో పాటు మోటార్లలో 5వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందన్న వార్తలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ లోనే అవినీతికి బీజం పడిందని… డీపీఆర్ లు బయటపెట్టకుండా యదేచ్ఛగా అవినీతి చేస్తున్నారంటూ నాగం జనార్ధన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు మొదటి నుండి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ సైతం ఇవే ఆరోపణలు చేస్తూ ఏకంగా సీఎం ఆఫీసు కేంద్రంగా మాఫియా నడుస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిలో కూరుకపోయిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లక తప్పదని నేతలు మండిపడుతున్నా… ఆ ఆరోపణలను కనీసం ఖండించే వారు కూడా కరువయ్యారు.
దీంతో మౌనమే… అంగీకారమా? అంటూ ప్రతిపక్ష నేతలు దూకుడు పెంచుతున్నారు. అంత సవ్యంగా ఉంటే ఎందుకు విమర్శలను ఖండించటం లేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న వేల కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ప్రభుత్వ పెద్దలే కబ్జాకోరుల వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.