కవితపై ఈడీ విచారణ బీజేపీ, బీఆర్‌ఎస్ లు ఆడుతున్న నాటకమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీది మిత్రభేదమంటూ ఆయన ఫైర్ అయ్యారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. కవిత ఈడీ విచారణ చాలా సాధారణ విషయమేనన్నారు.
కవిత ఈడీ విచారణను ఎదుర్కోవల్సిందేనన్నారు. సోనియా గాంధీని ఈడీ విచారించిన సమయంలో ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. వాటాల పంపకంలో వచ్చిన తేడా వల్లే ఈ చిల్లర పంచాయతీ అంటూ ఆయన మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు సమయం, తేదీని కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందామని ఆయన సవాల్ చేశారు.
కేటీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, చర్చకు తాను రెడీ అంటూ ఛాలెంజ్ విసిరారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై తాను చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్నారు.
అమర వీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రశాంత్ రెడ్డి అవినీతిపై విచారణ చేపడతామన్నారు.