తెలంగాణలో కాంగ్రెస్ కొత్త బాస్ ఎవరు…? ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారసుడు ఎవరు…? కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు సోనియా చాయిస్ ఎవరు…? అని ఆరా తీస్తే రేసులో మిగిలింది ఆ ఇద్దరే అని తెలుస్తోంది.
పీసీసీ చీఫ్ రేసులో నేనున్నాను అంటూ ఎంతోమంది నేతలు ముందుకొస్తున్నారు. కొందరైతే బయోడేటాను పట్టుకొని తిరుగుతున్నారు. అయితే, పీసీసీ చీఫ్‌ను సోనియాగాంధీ అతిత్వరలోనే ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఏపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో… తొలివెలుగు.కామ్ ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌పై ఆరా తీసింది.
పీసీసీ చీఫ్ మాకే కావాలని ఎంతో మంది అడిగిన సోనియా లిస్ట్‌లో మాత్రం శ్రీధర్ బాబుతో పాటు రేవంత్‌రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, యూత్‌తో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా రేవంత్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నారని, కేసీఆర్‌కు ధీటుగా పోటీలో నిలబడి వ్యూహారచన చేయటంలో రేవంత్‌రెడ్డియే సరైన ఆప్షన్ అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శ్రీధర్‌బాబుపై కూడా మంచి అభిప్రాయమే ఉన్నా… శ్రీధర్ బాబుకు కేటీఆర్‌తో మంచి స్నేహం ఉందని పైగా శ్రీధర్‌బాబు అయితే సీఎం కేసీఆర్ వాగ్ధాటి ముందు నిలబడగలరా అనే సందేహాలున్నాయని సమాచారం . అందుకే అతిత్వరలోనే రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేసి అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి.
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అంశంలో సోనియా కాస్త బిజీగా ఉన్నారని, పైగా ఆమె కొంత అనారోగ్యంతో ఉండటంతోనే ఫైనల్ కాలేదని తెలుస్తోంది. అతి త్వరలోనే రేవంత్‌కు పీసీసీ కన్ఫమ్ చేస్తూ ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి సోనియాను పార్లమెంట్ హాల్‌లో కలిసారి ప్రచారం సాగుతోంది.
ALSO READ: